ఏపీ, తెలంగాణకు అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ – తీరంలో భారీ వర్షాలు, తెలంగాణలో పిడుగులతో వానలు

బంగాళాఖాతంలో ముదురుతున్న ముప్పు – ‘అర్నబ్’ తుపాన్ దిశగా అల్పపీడనం, ఏపీ-ఒడిశాకు హెచ్చరికలు

BB6 TELUGU NEWS CHANNEL
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలాన్ని పుంజుకుంటోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తాజా అంచనాల ప్రకారం, ఈ అల్పపీడనం ఇవాళ్టిలో వాయుగుండంగా మారనుంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సోమవారం నాటికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్ గా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. అనంతరం మరింత బలపడి, రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరం వైపు పయనించే సూచనలు ఉన్నాయి.

దీని ప్రభావంతో అక్టోబర్ 26 నుంచి తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఒక్కోసారి వేగం 90 కిలోమీటర్ల వరకు చేరవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అర్నబ్ గా నామకరణం

అక్టోబర్ 26 నాటికి ఈ వ్యవస్థ తుపాన్ స్థాయికి చేరితే, దానికి ‘అర్నబ్’ అనే పేరు పెట్టనున్నారు. ‘అర్నబ్’ అనే పదానికి బెంగాలీ భాషలో సముద్రం అని అర్థం. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది.

ఏపీలో వర్షాల వివరాలపై APSDMA MD ప్రఖర్ జైన్ స్పందిస్తూ, సోమవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మంగళ, బుధవారాల్లో తీర ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఈరోజు (అక్టోబర్ 24) వర్ష సూచన:
కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో పరిస్థితి:
తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.