పేదలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారులు – నిజామాబాద్ జిల్లాలో పోలీసుల మెరుపు దాడులు

BB6 TELUGU NEWS CHANNEL
ప్రజలను పట్టి పీడించుకుంటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడం సబబేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎక్కువయ్యాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆత్యవసర ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిస్తూ, అప్పు తీసుకున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న వడ్డీ వ్యాపారుల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అప్పు తీసుకున్న వారి నుండి అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేయడం, సంతకాలు చేయించుకున్న ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకోవడం, అప్పు చెల్లించలేని వారిపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఆగడాలు పెచ్చుమీరాయి. అప్పు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించని బాధితులను మానసికంగా హింసిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితులు రుణ గ్రహీతలను మానసికంగా, శారీరకంగా కుంగదీస్తున్నాయి.

అక్రమ వడ్డీ దందాపై పోలీసుల ఫోకస్..

జిల్లాలో ఇప్పటికే వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పులకు వడ్డీలు కట్టలేక రోడ్డున పడిన కుటుంబాలెన్నో ఉన్నాయి. గతంలో బాధితులు వడ్డీ వ్యాపారుల వేధింపులపై పలువురు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి.

అక్రమ వడ్డీ దందాపై పోలీసుల ఫోకస్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలను అధిక వడ్డీలతో జలగల్లా పట్టి పీడిస్తున్న అనుమతి లేని వ్యాపారుల సడి విరిచేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నడుం బిగించారు. సీపీ గా చార్జి తీసుకున్న కొత్తలో అక్రమ వడ్డీ దందాపై ఉక్కు పాదం మోపి పలువురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా జిల్లాలోని 67 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. 47 చోట్ల అప్పులకు సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్లు, ఖాళీ చెక్కులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

అప్పు తీసుకుంటే అంతులేని కష్టాలే!

కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, వ్యాపార నష్టాలు, పిల్లల చదువుల కోసం కొందరు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవసరమైన పత్రాలు, హామీలు సమకూర్చుకోలేని వారు ప్రైవేటు అప్పుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే అవకాశంగా భావించే కొందరు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. తీసుకున్న అప్పులో కొంత మొత్తం తిరిగి చెల్లించినప్పటికీ, వడ్డీ పేరుతో మరింత డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.

ఖాళీ చెక్కులు.. బెదిరింపుల ఆరోపణలు

అప్పు ఇచ్చే సమయంలో కొందరు రుణగ్రహీతల నుంచి ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇతర పత్రాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించకపోతే ఆ పత్రాలను ఉపయోగించి ఇబ్బందులకు గురిచేస్తామని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు కూడా బాధితుల నుంచి వస్తుంటాయి.

పోలీసుల తనిఖీలతో అక్రమ దందాకు అడ్డుకట్ట?

వడ్డీ వ్యాపారంపై పోలీసులు తనిఖీలు నిర్వహించడం, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీయడం, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం ద్వారా అక్రమ వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనుమతులు, లైసెన్సులు అవసరమైన చోట వాటి చెల్లుబాటును పరిశీలించడంతో పాటు, వడ్డీ వసూళ్లకు సంబంధించిన రికార్డులను చట్టపరిధిలో తనిఖీలు చేస్తున్నారు.

బాధితులు ముందుకు రావాలి..

అధిక వడ్డీల వసూళ్లు, బెదిరింపులు లేదా బలవంతపు వసూళ్లకు గురైన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, అప్పు లావాదేవీలకు సంబంధించిన రసీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, సందేశాలు, ఇతర ఆధారాలను భద్రపరచుకోవాలి. ఫిర్యాదులపై వేగంగా స్పందించి, బాధితులకు భరోసా కల్పిస్తే ఇలాంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమ వడ్డీ వ్యాపారంపై పోలీసుల నిఘా కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా, బాధితులకు న్యాయం జరిగేలా కొనసాగాలి.

ప్రజలకు బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలపై అవగాహన కల్పిస్తే ప్రైవేటు అప్పులపై ఆధారపడే పరిస్థితిని కొంతవరకు తగ్గించవచ్చు