తెలంగాణలో ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి చెక్! ఫీజులు బోర్డుపై రాయాల్సిందే – సర్కార్ సంచలన ఆర్డర్స్

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు షాక్ ఇచ్చింది. ఇకపై ప్రతి ప్రైవేటు స్కూల్ తమ ఫీజుల వివరాలను నోటీసు బోర్డుపై రాయాల్సిందేనంటూ పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల ప్రైవేటు పాఠశాలలు ప్రతి ఏడాది 30 నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. దీనిపై తల్లిదండ్రుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి కఠిన చర్యలకు ఆదేశించారు.

ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజుల వివరాలను ప్రతి స్కూల్ తమ నోటీసు బోర్డుతో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ వివరాలను ఈ నెల 30వ తేదీ లోపు విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

ప్రభుత్వం కఠిన ఆదేశాలు:
1. ఫీజుల వివరాలు నోటీసు బోర్డుపై తప్పనిసరి 2. స్కూల్ వెబ్‌సైట్‌లో ఫీజులు డిస్ప్లే
3. జులై 30 లోపు ఆడిట్ రిపోర్ట్ అప్‌లోడ్ (2023-24, 2024-25)
4. నిబంధన పాటించకపోతే షోకాజ్ నోటీసు
కేవలం ఫీజులే కాదు… స్కూళ్ల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం గత రెండేళ్ల 2023-24, 2024-25 ఆడిట్ నివేదికలను CA ధృవీకరణతో సమర్పించాలని స్పష్టం చేశారు. గడువులోగా సమర్పించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని DEOలు, RJDలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదిలా ఉండగా త్వరలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. విద్యాశాఖ ప్రతిపాదన ప్రకారం ప్రైవేటు స్కూళ్లు ప్రతి రెండేళ్లకు ఒకసారి 8 శాతం వరకు మాత్రమే ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెంచాలంటే ఫీజు నియంత్రణ కమిటీ అనుమతి తప్పనిసరి. నిబంధనలు అతిక్రమిస్తే స్కూల్ గుర్తింపు రద్దుతో పాటు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం 2027-28 నాటికి ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిజంగానే ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా? లేక ఇది కూడా కాగితాలకే పరిమితమవుతుందా? అనేది వేచి చూడాలి.