బెట్టింగ్ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు..సెలబ్రిటీల ఆస్తుల అటాచ్‌ – రూ.7.93 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం

BB6 TELUGU NEWS CHANNEL
ఢిల్లీ: అక్రమ బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీవ్ర చర్యలకు దిగింది. బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన ప్రముఖ సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

ఈ కేసులో భాగంగా నటుడు సోనూసూద్‌, మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, రాబిన్‌ ఊతప్ప, నటీమణులు నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తిలకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తాజాగా అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ రూ.7.93 కోట్లుగా ఈడీ అంచనా వేసింది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం ద్వారా అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని మనీలాండరింగ్‌ ద్వారా దాచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదే కేసులో ఇప్పటికే ఈడీ మొత్తం రూ.19.7 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో మరికొంతమంది సెలబ్రిటీల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని, అవసరమైతే మరిన్ని ఆస్తుల అటాచ్‌కు అవకాశం ఉందని అధికారులు సూచించారు.

బెట్టింగ్‌ యాప్స్‌ ద్వారా యువతను మోసగించి భారీగా అక్రమ లాభాలు పొందిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఈడీ స్పష్టం చేసింది.