తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.

విశాఖపట్నం, హైదరాబాద్, ఆగస్టు18 BB6TELUGUNEWS : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా మధ్య, తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీని ప్రభావం వల్ల ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అయితే, గడిచిన 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. ఏపీలో అత్యధిక వర్షపాతాలు 17 చోట్ల నమోదయ్యాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

హెచ్చరికలు జారీ..
విశాఖపట్నం , అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు , ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతిపురం మన్యం, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణ, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్టులకు జలకళ..
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నిలిచిన రాకపోకలు…
కాగా, హైదరాబాద్‌లోని విద్యానగర్ టీఆర్టీ కాలనీలో భారీ చెట్టు నేలకూలింది. దీంతో సమీపంలోని కారు ధ్వంసమైంది. మేడ్చల్, శామీర్‌పేట్, మూడుచింతలపల్లిలో చెరువులు అలుగు పారుతున్నాయి. మేడ్చల్-గౌడవెల్లి రహదారిపై వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వరదతో ఆరు గేట్లు ఎత్తివేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు భారీగా వరద ప్రవహిస్తోంది. భారీ వరద ప్రవాహంతో 24 గేట్లు ఎత్తివేశారు. ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు భారీగా వరద చేరింది. అలాగే పెనుమాకలంక-కైకలూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
Related News
ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గోవా, మహారాష్ట్రలలో భారీ వర్షాలు…
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ నెల (ఆగస్టు) 18, 19 తేదీల్లో కొంకణ్ ప్రాంతం (ముంబైతో సహా) గోవా, మధ్య మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాలు, తీర కర్ణాటకలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 19, 20 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబైని వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలమైంది. హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 15 పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి.