ఏకగ్రీవానికి నిరాకరించి నామినేషన్ వేసిన సర్పంచి అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అతనిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో చోటు చేసుకుంది.
BB6 TELUGU NEWS CHANNEL
ఏకగ్రీవానికి నిరాకరించి నామినేషన్ వేసిన సర్పంచి అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అతనిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వు అయింది. కాంగ్రెస్ మద్దతుతో వొట్కూరి సందీప్ రెడ్డి భార్య వాణి నామినేషన్ వేశారు.వారు ఏకగ్రీవానికి ప్రయత్నించినప్పటికీ భారత రాష్ట్ర సమితి మద్దతుతో మామిడి నాగలక్ష్మి నామినేషన్వేసేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు శనివారం ఉదయం నకిరేకల్లోని తన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి ఎల్లమ్మగూడకు వెళ్లేందుకు నాగలక్ష్మి భర్త యాదగిరి అద్దెకారు మాట్లాడేందుకు బయటకు వెళ్లారు. 10 నిముషాల తర్వాత ఆమె ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది.దీంతో భయాందోళనకు గురై భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అనుచరులకు సమాచారం ఇచ్చారు. తన భర్తను సందీప్ రెడ్డి, అతని
సమాచారం ఇచ్చారు. తన భర్తను సందీప్ రెడ్డి, అతని అనుచరులు కిడ్నాప్ చేశారని తిప్పర్తి ఠాణాలో, జిల్లాఎస్పీ శరత్చంద్రపవారికి ఫిర్యాదు చేశారు. ఆపై మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ సైదిరెడ్డిల పర్యవేక్షణలో నాగలక్ష్మి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. భారత రాష్ట్ర సమితి మద్దతుతో కొర్రినిర్మల అనే మహిళ కూడా నామినేషన్ వేశారు. అదే రోజు రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు యాదగిరిని తిప్పర్తి పోలీసుస్టేషన్ ఎదుట వదిలి పరారయ్యారు. దీంతో పోలీసులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించి అప్పగించారు.
ఈ సందర్భంగా యాదగిరి మీడియాతో మాట్లాడుతూ..’అద్దె కారు కోసం బయటకు వెళ్లిన నన్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచరుడైన సందీప్‌రెడ్డి, అతని అనుచరులు ముసుగులు ధరించి కిడ్నాప్ చేశారు. కులంపేరుతో దూషించారు. నకిరేకల్ నుంచి కట్టంగూరు అటు నుంచి ఓఆర్ఆర్, ఎల్బీనగర్ వరకు పిడిగుద్దులు గుద్దుతూ తీసుకెళ్లారు. కత్తులతో ఒంటిపై గాయాలు చేశారు. ఇంటికి ఫోన్ చేసి నామినేషన్ వేయొద్దని చెప్పాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. నాగలక్ష్మి నామినేషన్ వేసిన విషయం తెలుసుకున్న తర్వాత మరింత రెచ్చిపోయారు. దాహం వేస్తుందని అడిగితే నాలుగు గ్లాసుల్లో మూత్రాన్ని పట్టి నాతో బలవంతంగా తాగించారు’ అని ఆరోపించారు. నాగలక్ష్మి మాట్లాడుతూ.. ‘తిప్పర్తి పోలీసులు నా భర్తతో బలవంతంగా తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఎవరూ కిడ్నాపనకు పాల్పడలేదని, తానే స్నేహితులతో కలిసి వెళ్లానని ఆయనతో ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సందీప్‌రెడ్డి, అతని అనుచరులపై కేసులు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు. కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి’ అని ఆమె కోరారు.
విచారణలో తేలుస్తాం-ఎస్సై శంకర్
ఈ విషయమై తిప్పర్తి ఎస్సై శంకర్ మాట్లాడుతూ ‘యాదగిరిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదు చేశాం. మేం ఎలాంటి సంతకాలు తీసుకోలేదు. ఈ కిడ్నాప్ చేసింది ఎవరనేదానిపై విచారణ చేస్తున్నాం. బాధితుడి ఒంటిపై గాయాలు లేవు. ఆయన చూపేవన్నీ పాత గాయాలే.మూత్రం తాగించారనే ఆరోపణలపై విచారణ చేపడతాం.అయితే బాధితులు వైద్య పరీక్షలకు, విచారణకు సహకరించడం లేదు’ అని పేర్కొన్నారు.