రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్: డిప్యూటీ సీఎం భట్టి
పక్క రాష్ట్రానికి వరాల జల్లు.. మనపై వివక్ష.. కక్ష
హైదరాబాద్ ను కాదని.. ‘ఆరెంజ్ ఎకానమీ’ ప్రాజెక్ట్ ముంబై పాలు..
సెమీ కండక్టర్ లేదు.. మెట్రో ఊసు లేదు ఫార్మా హబక్కు దగా.. బయోలో మొండిచేయి
రాజకీయాలకతీతంగా కేంద్రంపై పోరాడుదామని రాష్ట్ర ఎంపీలకు
పిలుపు
BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన రూ.53.5 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు బిగ్ జీరో అని పేర్కొన్నారు. ఆదివారం ప్రజా భవనంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిసినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం అనేక విన్నపాలు చేసినా కేంద్రం కనీసం కనికరించలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈబడ్జెట్ ఉందని విమర్శించారు. విభజన హామీల ఊసే ఎత్తకుండా కేంద్రం
మొండిచేయి చూపిందని, ఇది తెలంగాణ ప్రజలను వంచించడమేనన్నారు.తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్ష ఈబడ్జెట్ ద్వారా మరోసారి స్పష్టంగా బహిర్గతమైందని పేర్కొన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని కలిసి నిధులకేటాయింపుపై ఒత్తిడి తేవాలని కోరారు. బయో ఫార్మా రంగానికి కేరాఫ్ అడ్రస్నిలిచే తెలంగాణను కేంద్రం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ప్రపంచ ఫార్మా హబ్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ను పక్కనపెట్టి ఇతర ప్రాంతాలకు నిధులివ్వడం అన్యాయమని అన్నారు. కొవిడ్ సమయంలో భారత్ భయోటెక్ లాంటి సంస్థలు ప్రపంచానికి ప్రాణవాయువులాంటి మందులను అందించాయని గుర్తు చేశారు. స్వయంగా ప్రధాని సందర్శించినా ఈ రంగానికి
బడ్జెట్ లో గుర్తింపు దక్కకపోవడం దారుణమన్నారు.
ఎలక్ట్రానిక్స్ రంగానికి ఒక్క రూపాయీఇవ్వరా?ఎలక్ట్రానిక్స్ రంగానికి బడ్జెట్లో రూ.40వేల కోట్లు కేటాయించినా, అందులో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ హాయాంలో ఈసీఐ ఎలాంటి సంస్థలతో నగరం ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ కు కేంద్రంగా మారిందని వివరించారు. ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అన్నట్టుగా ఉన్నా, కేంద్రం మాత్రం నిధుల విషయంలో మొండిచెయ్యి చూపిందన్నారు.. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల సంక్షేమాన్ని కేంద్ర బడ్జెట్ పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు.బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎలాంటి ప్రత్యేక నిధులు లేదా పథకాలు ప్రకటించకపోవడం వారి పట్ల వివక్షేనన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా కేంద్రం నిర్ణయాలు తీసుకున్నదని మండిపడ్డారు. హైదరాబాదుకు దక్కాల్సిన‘ఆరెంజ్ ఎకానమీ’ ప్రాజెక్టును ముంబైకి తరలించడంపై భట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆడియో, వీడియో, గేమింగ్,కామిక్స్లాంటి విభాగాలకు దేశంలోనే హైదరాబాద్ అతిపెద్ద కేంద్రంగా ఉందని తెలిపారు. మన రాష్ట్రం చేసిన తప్పేంటో
చెప్పాలని, సమర్థవంతమైన వ్యవస్థ ఉన్నా
ముంబైకి ఎందుకు మొగ్గు చూపారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మెడికల్ హబ్ గా ఎదిగిన హైదరాబాదుకు ‘రీజినల్ మెడికల్వ్యాల్యూ హబ్ ‘ కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఒలింపిక్ విజన్ ఉన్నా..క్రీడారంగానికి నిధులివ్వలేదు..క్రీడారంగానికి తెలంగాణ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా కేంద్రం గుర్తించలేదని, ఒలింపిక్ విజన్ ఉన్నా నిధులు ఇవ్వలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 2047 విజన్ డాక్యుమెంట్తో ముందుకు వెళ్తున్నా, కేంద్రం మాత్రం కనీస తోడ్పాటు అందించలేదన్నారు. కేంద్రం నిర్ణయాలు చూస్తుంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నదని విమర్శించారు. టూరిజం అభివృద్ధిలో తెలంగాణకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్యాకేజీల్లో రాష్ట్రపేరు లేకపోవడం అన్యాయమన్నారు. యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయం,మన్ననూరు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ఫారెస్టుల అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. మేడారం జాతరను విదేశీయులు సైతం దర్శిస్తున్నా, పర్యాటకరంగంలో కేంద్రం తెలంగాణను విస్మరించిందని పేర్కొన్నారు. రేర్ ఎర్త్మినరల్స్ విషయంలోనూ రాష్ట్రంపై కేంద్రం దృష్టి సారించలేదని విమర్శించారు.సత్తుపల్లి, రామగుండం ప్రాంతాల్లో సింగరేణి సంస్థ లిథియం లాంటి ఖనిజాల వెలికితీతకు ప్రయత్నిస్తున్నా కేంద్రంనుంచి సహాయం లేదన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమల కోసం సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు సెమీ కండక్టర్ యూనిట్లు ఇచ్చి, సాంకేతికంగా ముందున్న తెలంగాణకు మొండిచెయ్యి చూపారని
పేర్కొన్నారు.
మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు ఫోన్ ట్యాపింగ్ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయని మీడియా అడిగిన ప్రశ్నపై భట్టి విక్రమార్క స్పందించారు. “ప్రభుత్వానికి ఎవరి మీద కక్షసాధింపు ఆలోచన లేదు.. ఎవరైనా కక్షసాధింపు అనుకుంటే అది వారి అభిప్రాయం మాత్రమే. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడమేమా ప్రభుత్వ లక్ష్యం. విచారణ ప్రక్రియపై నేను కామెంట్ చేయను.. కామెంట్ చేస్తే ఎంక్వెరీపై ప్రభావం పడుతుంది. విచారణ పూర్తయ్యాక.. ఫోన్ ట్యాపింగ్ ఎందుకుచేశారు? ఎవరి కోసం చేశారో తెలుస్తుంది.ఉగ్రవాద నిర్మూలన కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను కొందరు వ్యక్తులపై చేశారు. కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుగుతున్నది” అని వ్యాఖ్యానించారు.