తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పోలింగ్ సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. గత సంవత్సర కాలంగా గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల కోసం ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్లు కీలక అంశంగా మారాయి. తెలంగాణ కేబినెట్ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అమలు కోసం పకడ్బందీగా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ (జీవో) రూపొందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, తద్వారా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూస్తోంది. కాగా, తెలంగాణ హైకోర్టు కూడా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లోపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం సమ్మతి తెలిపిన తర్వాత 60 రోజుల్లోపు సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు పూర్తి చేసి, ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe