వసూల్‌రాజాలపై వేటు మహంకాళి పీఎస్‌లో ముగ్గురు ఖాకీలు సస్పెన్షన్
సిటీలో మరో 13 మందిపై అంతర్గత విచారణ
వసూళ్లకు పాల్పడితే సహించేది లేదు
సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో/బేగంపేట, జూన్ 18(నమస్తే తెలంగాణ): ఓ వ్యాపారిని హవాలా డబ్బులు ఉన్నాయంటూ బెదిరించి.. కేసు లేకుండా చేసేందుకు డబ్బులు తీసుకున్న వ్యవహారంలో మహంకాళి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. కడప నుంచి ఓ వజ్రాల వ్యాపారి నగదు తీసుకుని వెళ్తుండగా శ్యామ్, మహేశ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అతనిని మహంకాళి పీఎస్ పరిధిలో పట్టుకున్నారు. అతని దగ్గర ఉన్న నగదు హవాలాది అంటూ బెదిరించారు. డీఐ కేసరి ప్రసాద్‌కు సమాచారమిచ్చి అతను చెప్పినట్లుగా ఆ వ్యాపారిని బెదిరించి సెటిల్‌మెంట్‌కు ఒప్పించారు.
ఆరు లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు. దీంతో ఆ వ్యాపారి తన అకౌంట్ నుంచి వారి ఖాతాకు నేరుగా 6 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు. డబ్బుల నుంచి వారు 50వేలు వాడుకున్నారు. అయితే తన అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన రసీదులతో సహా తనను డబ్బులు డిమాండ్ చేసిన వారిపై ఆ వ్యాపారి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో డీఐ కేసరి ప్రసాద్, శ్యామ్, మహేశ్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో ఈ ఇన్‌స్పెక్టర్ పనిచేసిన దగ్గర కూడా ఇలాంటి వివాదాలే ఉన్నాయని తెలిసింది.
ఇటీవల నాంపల్లి వద్ద పెద్ద ఎత్తున బంగారం పట్టుకున్న వ్యవహారంలో పోలీసులు మధ్యవర్తితో బేరసారాలు సాగించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల నుంచి నాంపల్లి మీదుగా బంగారాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఇంత బంగారమెక్కడిదంటూ పోలీసులు అతనిని ఆపి ప్రశ్నించారు. బంగారం స్వాధీనం చేసుకుని మధ్యవర్తిని నానా తిప్పలు పెట్టారు. ఆనోటా ఈనోటా బయటపడడంతో మధ్యవర్తిని పిలిచి ఏం జరగలేదని చెప్పాలంటూ బెదిరించినట్లు తెలిసింది. చివరకు ఈ విషయంపై ఎక్కడా బయటపడకుండా రూ. 20లక్షల్లో సెటిల్ చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆ ప్రాంత ఉన్నతాధికారి స్థాయిలో ఎంక్వైరీ జరిగినా కిందిస్థాయి అధికారులు మాత్రం తాము పట్టుకున్న బంగారం విషయంలో తగ్గేదే లేదంటూ ఫైనల్ సెటిల్‌మెంట్‌లో పని కానిచ్చేశారని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
కొత్తగా బాధ్యతలు తీసుకున్న చోటే..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు పోలీస్‌స్టేషన్లలో పనిచేసే సిబ్బందిపై ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నెల కిందటే ట్రాన్స్‌ఫర్లయి వచ్చినప్పటికీ కొంతమంది తమ పాత పోలీస్‌స్టేషన్లలో చేసిన దందాలకు సంబంధించి ఇంకా లావాదేవీలు నడుపుతున్నారంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ల్లో పనిచేస్తున్న 13 మంది ఇన్‌స్పెక్టర్లపై అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
మహంకాళి పీఎస్‌కు ఇటీవలే చిక్కడపల్లి నుంచి బదిలీ అయి వచ్చిన డీఐ వచ్చీ రావడంతోనే తన కిందిస్థాయి సిబ్బందితో కలిసి డబ్బుల దందా మొదలుపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాతబస్తీలోనూ ఇదే తరహాలో ఒక ఇన్‌స్పెక్టర్ తన వద్దకు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ఎస్‌ఐ ద్వారా సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఫిర్యాదుదారులకు సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలో కూడా ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారు. ఇక సౌత్ జోన్ పరిధిలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఒక చీటింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వస్తే వారి వద్ద నుంచి పర్సంటేజీ మాట్లాడుకుని వారు ఒప్పుకోకపోతే మోసగాడితో కుమ్మక్కయ్యారంటూ ఒక ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు వచ్చాయి.
అదే జోన్‌కు చెందిన మరో కొత్త ఇన్‌స్పెక్టర్ చార్జ్ తీసుకున్న తర్వాత తన దగ్గర పనిచేసిన పాత వారి ద్వారా లోకల్‌లో జరిగే వ్యాపారాలు, వాటి నుంచి వచ్చే మామూళ్లపై వివరాలు తీసుకుని ఆ వ్యాపారులకు తమ మామూళ్లు తమకు సరిగ్గా అందాలంటూ హుకుం జారీ చేశారని.. అయితే ఈ వ్యవహారం ఉన్నతాధికారి వరకు చేరడంతో ఆయన అతనిని పిలిచి మందలించినట్లు తెలిసింది. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో అక్రమ దందాలు జరిగితే సహించేది లేదని, ఫిర్యాదుదారులను వేధించినా సెటిల్‌మెంట్లకు పాల్పడినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
వసూల్‌రాజాలపై వేటు మహంకాళి పీఎస్‌లో ముగ్గురు ఖాకీలు సస్పెన్షన్

22
Jun