బీఫామ్స్ దక్కని అభ్యర్థుల లొల్లి ..చివరి రోజు హైడ్రామా! మున్సిపల్ ఎన్నికల్లో..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ఇంటిపై చెప్పులు, మట్టి పోసి నిరసన .

జగిత్యాల జిల్లా రాయికల్ లో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల రాజీనామా

జనగామలో నేరుగా ఆర్వోలకే బి బీఫామ్స్

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో టికెట్ ఇవ్వలేదని దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ మహిళా లీడర్

కోదాడలో అజ్ఞాతంలోకి బీఆర్ఎస్ అభ్యర్థి, మిస్సింగ్ కేసు పెట్టి బీఆర్ఎస్ ఆందోళన

ఉపసంహరణల కోసం జోరుగా బేరసారాలు

పలుచోట్ల పార్టీల నుంచి బీఫామ్స్ తీసుకొని విత్రాలు

కరీంనగర్ లో పార్టీ మారబోమని ప్రమాణం చేశాకే బీజేపీ అభ్యర్థులకు బీఫామ్స్

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ  : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా చివరి రోజు హైడ్రామా నడిచింది. బీ
ఫామ్స్ దక్కని పలువురు అభ్యర్థులు
నేతలపై దుమ్మెత్తిపోయగా, బీఫామ్స్ ధక్కిన కొందరు చివరి నిమిషంలో నామినేషన్లు విత్ డ్రా చేసుకొని ఏకగ్రీవాలకు సహకరించడం ఆసక్తిరేపింది. ,కరీంనగర్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిపై సొంత పార్టీ లీడర్లే చెప్పులు విసిరి, మట్టిపోసి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ టికెట్లు రాకపోవడంతో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేశారు. బీ ఫాం ఇవ్వలేదని సిరిసిల్లలో బీజేపీ మాజీ కౌన్సిలర్, కరీంనగర్ లో బీజేపీ సిటీ మాజీ ప్రెసిడెంట్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పార్టీ టికెట్
ఇవ్వలేదని కాంగ్రెస్ మహిళా లీడర్ దుమ్మెత్తి పోశారు. జనగామలో అభ్యర్థులకు కాకుండా నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్లకే బీ ఫామ్స్ అందించారు. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్ఞాతంలోకి వెళ్లగా.. ఆ పార్టీ లీడర్లు మిస్సింగ్ కేసు పెట్టి ఆందోళనకు దిగారు. మరోవైపు విత్రాల కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బేరసారాలు జరిగాయి. పలుచోట్ల వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. చౌటుప్పల్ లో ఉమామహేశ్వరి అనే అభ్యర్థి బీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయగా..రెండు పార్టీలు బీ ఫామ్స్ ఇచ్చాయి. బీఆర్ఎస్ బీ ఫాం తన దగ్గరే పెట్టుకొని కాంగ్రెస్ బీఫాంపై ఆమె పోటీకి దిగారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా బీఫామ్ ధక్కని అభ్యర్థుల తిరుగుబాటు …

జగిత్యాల మున్సిపాలిటీలో 50వార్డులకుగాను బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెసులో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 30, కాంగ్రెస్ సీనియర్ లీడర్ , మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గానికి 20 మందికి టికెట్లు లభించాయి. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 8,జీవన్ రెడ్డి వర్గానికి 4 సీట్లు కేటాయించడంతో జీవన్‌రెడ్డి వర్గీయుల్లో ఆగ్రహావేశం కట్టలు తెంచుకున్నది. దీంతో రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపాముల మమత తమ పదవులకు రాజీనామా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేండ్లుగా పనిచేస్తే నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసి నా మెడ కోసేసింది’అని జీవన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వార్డు నుంచి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చినా మేకల రమేశ్ పోటీకి నిరాకరించారు. వర్గపోరు కారణంగా పోటీలో ఉండలేనని తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.ఉద్రిక్తత కారణంగా ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ కార్యాలయం, ఆయన ఇంటి వద్దపోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాగర్ కర్నూలు లో 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాసుకు బీ ఫామ్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.

కల్వకుర్తి మున్సిపాలిటీలో 11వవార్డు నుంచి నామినేషన్ వేసిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మల్లెపల్లి జగన్ కు టికెట్ నిరాకరించడంతో పార్టీకి రిజైన్ చేశారు. ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని ప్రకటించారు. 10వ వార్డులో బీఆర్ఎస్ ను కుడుముల మనోహర్ రెడ్డికి పార్టీ టికెట్‌ ధక్కకపోవడంతో రెబల్గా బరిలో నిలిచారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వకపోవడంతో నీలం శ్రీలత ఎంపీడీవో ఆఫీసు ఎదురుగా బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.టికెట్లు అమ్ముకున్నారంటూ శాపనార్థాలు పెడుతూ దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తానని శపథం చేశారు.

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ పొత్తు కుదుర్చుకుని,తమకు అన్యాయం చేశారంటూ ఆర్వో కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పొత్తు పేరుతో గొంతు కోశారని ఆరోపిస్తూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా స్లోగనే చేశారు. హామీతో మూడు డివిజన్లలో సీపీఎం అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.

కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఒకే డివిజన్లో ఇద్దరికి కాంగ్రెస్ బీ ఫామ్లు అందించారు. కరీంనగర్ లో 66 డివిజన్లలో 57వ డివిజన్ ను కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చింది. అధిష్టానం నుంచి వచ్చిన బీఫారాల్లో ఒకటి మిగిలింది. కాగా 50వ డివిజన్ నుంచి పార్టీ ఫైనల్ చేసిన కొత్త అనిల్ కు పార్టీ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు బీఫామ్ ఇచ్చారు. ఇదే డివిజన్ నుంచి టికెట్ ఆశించిన రాచకొండ చక్రధర్ రావుకు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్ మిగిలిపోయిన బీ ఫామ్ ఇవ్వడంతో గందరగోళం నెలకొంది.రామగుండం కార్పొరేషన్లు 21డివిజన్ అభ్యర్థిగా ముందుగా కందుల స్వరూప పేరును ఖరారు చేసి బీ ఫామ్ అందజేశారు. ఆమె మధ్యాహ్నం రిటర్నింగ్ ఆఫీసర్ కు బీఫామ్ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ బీఫామ్ను మరో అభ్యర్థి బూర్ల లక్ష్మికి ఇచ్చారు. ఆమె గడువు ముగిసిన తర్వాత 3.05 గంటలకు ఆర్వోకు అందించగా అక్కడే ఉన్న స్వరూప అభ్యంతరం చెప్పారు.దీంతో రిటర్నింగ్ ఆఫీసర్ పరుశురామ్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఎవరిని అధికారిక అభ్యర్థిగా గుర్తిస్తారన్న అంశం తేలాల్సిఉంది.

పోలీసుల బందోబస్తు మధ్య బీఫామ్ అందజేత

నాగర్ కర్నూల్ 15వ వార్డును ఏకగ్రీవం చేయాలన్న కాంగ్రెస్ ప్లాన్ బేడిసి కొట్టింది . ఇక్కడ బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెసులో చేరిన ఇసాక్కు పార్టీ టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి గా తవిటి ఇందిరా పేరు ఖరారు కాగా..ఇసాక్ వర్గం ఆమె భర్త నిరంజన్ ను ఒప్పించి పోటీ నుంచి తప్పించారు. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. నసీమా బేగంను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ నాయకులు నసీమా బేగం ఇంటికి వెళ్లి పోటీ చేయకుండా ఒప్పించాలని ప్రయత్నించారు. విషయం తెలిసిన మర్రి జనార్దన్ రెడ్డి కూడా ఆమె ఇంటికి చేరుకోగా.. రెండుపార్టీల నేతల మధ్య వాగ్వాదం,తోపులాట జరిగింది. పోలీసులు చేరుకొని నసీమా బేగంతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ఆమె చెప్పడంతో బందోబస్తు మధ్య మున్సిపాలిటీకి తీసుకెళ్లి బీఫామ్ సమర్పించారు.

జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వలేదు. ఓ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి పార్టీకి తెల్వకుండా నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో ఆపార్టీ లీడర్లు మరో క్యాండిడేట్ ను హైదరాబాదుకు తరలించారు. ఈపరిణామాలతో రెండు పార్టీల ఇన్చార్జీలు నేరుగా ఆర్వోలకే బీసామ్సు ను అప్పగించారు.

పార్టీ మారబోమని ప్రమాణం చేశాకే బీ ఫామ్ లు

గెలిచినా.. ఓడినా పార్టీ మారబోమని, హైకమాండ్ మాట జవదాటబోమని అభ్యర్థులతో దేవుని సాక్షిగా ప్రమాణం చేయించుకున్న తర్వాతే అభ్యర్థులకు బీజేపీ లీడర్లు బీ-ఫామ్ లు ఇచ్చారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది.

హుజూరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులను పట్టణ సమీపంలోని పాటిమీద ఆంజనేయ స్వామిగుడికి రప్పించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం అభ్యర్థులతో పార్టీ మారబోమంటూ దేవుడి మీద ప్రమాణం
చేయించుకున్నాకే బీఫామ్లు అందజేయడం గమనార్హం.

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ గత రెండు రోజులుగా వినూత్న రీతిలో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.గెలిచిన తరువాత పార్టీని వీడబోనని,పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని,కరీంనగర్ అభివృద్ధితో పాటు దేశం కోసం,సమాజం కోసం పనిచేస్తానని ప్రమాణం చేయించారు. కోతిరాంపూర్ చౌరస్తా, పాతఅడ్డా వద్ద నిర్వహించిన ఎన్నికల లేబర్ ప్రచార సభలో.. 9, 39. 40, 62, 63, 64డివిజన్లలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ల పంచాయితీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేశాడని ఆయన ఇంటి ఎదుట రెండో డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి దాసరిసాగర్, మూడో డివిజన్ అభ్యర్థి దాసరిప్రభాకర్ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. గంగుల ఇంటిమీదికి చెప్పులు, కరపత్రాలు, మట్టిని విసురుతూ శాపనార్థాలు పెట్టారు. బీఆర్ఎస్ ప్రచారం కోసం తయారు చేసిన కరపత్రాలు, డోర్ పోస్టర్లు ఆయన ఇంటిముందే దహనం చేశారు. గంగుల కమలాకర్ టీడీపీలో ఉన్నప్పటినుంచి ఆయనతోనే ఉంటున్నామని, అయినా తమకు అన్యాయం చేసి వేరొకరికి టికెట్ ఇచ్చారని దాసరి సాగర్ మండిపడ్డారు.
కరీంనగర్ 24వ డివిజన్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీ మాజీ సిటీ ప్రెసిడెంట్, అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు లేఖ రాశారు. మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ భార్యకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదంటూ మాలమహానాడు ఆధ్వర్యంలో కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాలరాజేందర్ రావు దిష్టి బొమ్మ దహనం చేశారు.

కోదాడలో అజ్ఞాతంలోకి బీఆర్ఎస్ అభ్యర్థి..

ఎన్నిక ఏకగ్రీవం..సూర్యాపేట జిల్లా కోదాడలో 11 వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన దొడ్డి గర్ల గీత చివరి నిమిషంలో విత్ డ్రా చేసుకొని.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి భర్తతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిని కాంగ్రెస్ వాళ్లే కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనకు దిగారు. తమ క్యాండిడేట్ ను బెదిరించి విత్ చేయించారంటూ కొమరబండ జాతీయ రహదారి పై ధర్నా చేశారు. కోదాడ రూరల్ పోలీసుస్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్ నాయకులు కంప్లెంట్ ఇచ్చారు. 11వ వార్డులో అందరూ విత్ డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి దేవరం మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe