BB6 TELUGU NEWS CHANNEL
రేషన్ కార్డు ఈ కేవైసీపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారనే వార్తలో వాస్తవం లేదన్నారు. అయితే కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఏదైనా రేషన్ షాపునకు వెళ్లి తమ వేలిముద్ర లేదా ఐరిష్ నమోదు చేసుకోవడం తప్పనిసరన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు తమకు సమీపంలోని షాపులో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. వృద్ధులు, పిల్లలకు బయోమెట్రిక్ సమస్యలు ఉంటే ఆధార్ కేంద్రంలో వివరాలు అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ–కేవైసీ (e-KYC) ప్రక్రియపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ–కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారని, కార్డులు రద్దవుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
రేషన్ బియ్యం పంపిణీకి, ఈ–కేవైసీ ప్రక్రియకు ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ప్రక్రియ కేవలం లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించుకోవడానికి మాత్రమే చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ–కేవైసీ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎటువంటి గడువును విధించలేదు. లబ్ధిదారులు తమకు వీలైన సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కానీ తప్పని సరిగా ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా రేషన్ షాపుకు వెళ్లి తమ వేలిముద్రలు లేదా ఐరిష్ గుర్తులను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో పథకాల పారదర్శకతకు ఉపయోగపడుతుంది.
క్షేత్రస్థాయిలో ఈ–కేవైసీ నిర్వహించే సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో సరిగ్గా పడటం లేదు.
వేలిముద్రలు నమోదు కాని వారు ముందుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను, ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రలు అస్సలు పడని పక్షంలో, ఐరిష్ ఆధారంగా కేవైసీ పూర్తి చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
TG: ఈ కేవైసీ చేసుకోకుంటే రేషన్ బంద్..! సివిల్ సప్లై కమిషనర్ కీలక వ్యాఖ్యలు.. క్లారిటీ ఇదే..
20
Dec