ప్రాణహిత-చేవెళ్ల, SLBC ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం సిఎం రేవంత్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత – చేవెళ్ల,ఎస్ఎల్ఎబీసీ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా నదులపై వైఎస్సార్ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా ఆయన జీవితంలోని చివరి కోరిక నెరవేర్చే వరకు విశ్రమించకుండా పని చేస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని హోటల్ దస్పల్లాలో జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎంరేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ విప్లవ పితామహుడు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్, శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ వ్యవస్థాపకులు డాక్టర్ చదలవాడ సుధా,డాక్టర్ చదలవాడ నాగేశ్వర రావుకు డా.వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక తొలిపురస్కారాన్ని అందజేశారు.

అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ..“వ్యవసాయం దండక కాదు పండుగ చేయాలన్న వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా నదులపై తలపెట్టిన ప్రాజెక్టులను కచ్చితంగా పూర్తిచేసి తీరుతాం. కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్ల కాలంలో బాధల నుంచి రైతులను కాపాడాలని 2007-08లో ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్సార్ పునరుజ్జీవం కల్పిస్తే తర్వాత ప్రభుత్వంలో రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి ఆప్రాజెక్టును తప్పించారు.

రైతాంగానికి మేలు చేయాలని, చేవెళ్ల,వికారాబాద్, తాండూరు, కొంత కొడంగల్ ప్రాంతం చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలన్న వైఎస్సార్ ఆశయానికి అనుగుణంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల కడతాం. ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్గొండ ప్రజలను రక్షించాలని సంకల్పించిన ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రైతునే రాజును చేయాలన్న ఆలోచనతో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం రైతాంగానికి ఉచిత విద్యుత్కు సంబంధించిన ఫైలుపై సంతకం చేయడమే కాకుండా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు.

1300 కోట్ల రూపాయల మేరకు రైతుల బకాయిలను రద్దు చేశారు. దేశంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలంటే తప్పని సరిగా వైఎస్సార్ ను గుర్తుచేసుకోక తప్పనిరీతిలో అందరి మదిలో ఆయన స్థానం పదిలం చేసుకున్నారు.వైఎస్సార్ ఆలోచనల కొనసాగింపుగా వారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీలను తమ
ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచాం. ఫీజు రీయింబర్స్ మెంట్ కోనసాగిస్తున్నాం. వైఎస్ ఆలోచన, వారి స్ఫూర్తితోనే దేశంలోనే మొట్ట మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. రైతు
సంక్షేమం కోసం అధికారంలోకి రాగానే 25 లక్షల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేసి విముక్తులను చేశాం. వరి వేసుకుంటే ఉరివేసుకున్నట్టే అన్న రోజుల నుంచి వరివేసుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తామని ప్రోత్సహించాం.ఈరోజు దేశంలోనే అత్యధికంగా 2.85కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి మొదటి స్థానంలో నిలిచాం. కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించని కారణంగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. పాలేకర్ సుచించినట్టు మార్గంలో రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రచిస్తాం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, మాజీ ఎంపీకేవీపీ రామచంద్ర రావు తదితరులు
పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe