రేషన్ కార్డుదారులకు షాక్.. ఆ జిల్లాలో అనర్హులుగా 92,135 మంది..

mahabubnagar Civil Supplies Officials Identifying The Names Of Ineligible People On Ration Cards In Mahabubnagar District

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ ద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2,027 రేషన్ దుకాణాల పరిధిలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 92,135 మంది అనర్హులను గుర్తించారు. లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా చూడటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. రేషన్ కార్డు ఉన్నా.. గత ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని వారి పేర్లను కూడా అనర్హుల జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసింది. అయితే.. ఈ జారీ ప్రక్రియలో కొన్ని తప్పిదాలు జరిగాయని, దీనివల్ల అనర్హులకు కార్డులు మంజూరయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ గుర్తించింది. గత రెండు నెలలుగా బియ్యం పంపిణీలో జాప్యం కూడా జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటం లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ ఏరివేత..
ఈ నేపథ్యంలో.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,027 రేషన్ దుకాణాల పరిధిలో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖాధికారులు సంయుక్తంగా ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా జారీ చేసిన కార్డులతో పాటు, గతంలో ఉన్న పాత కార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

అధికారుల ప్రాథమిక పరిశీలనలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 92,135 మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి రేషన్ కార్డులోని లబ్ధిదారుల పేర్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారం రోజులుగా ఈ పరిశీలన ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన అనర్హుల వివరాలను ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. రేషన్ దుకాణాల డీలర్ల నుండి లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. అంతే కాకుండా.. గత ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని వారి పేర్లను కూడా అనర్హుల జాబితాలో చేర్చడమే కాకుండా.. రేషన్ కార్డులను రద్దు కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం



ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,60,537 రేషన్ కార్డులు ఉండగా.. వాటి ద్వారా 33,65,854 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే.. ఈ కార్డులలో చాలా మంది పెళ్లయి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారు, మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు ఇంకా నమోదై ఉన్నాయి. అలాంటి వారికి కూడా ప్రతినెలా బియ్యం పంపిణీ జరుగుతూ ఉండటం సమస్యకు దారితీసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం బియ్యం పంపిణీ విధానంలో ఉన్న లొసుగులు. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక్కరు వేలిముద్ర వేసినా బియ్యం పంపిణీ చేస్తారు.

కుటుంబ సభ్యులంతా వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. దీంతో, కార్డులో చనిపోయిన వారు, పెళ్లయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు ఉన్నప్పటికీ, వారి పేరున కూడా బియ్యం తీసుకునే అవకాశం ఏర్పడింది. ఈ లోపాన్ని సరిచేయడానికి, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా చూడటానికి ప్రభుత్వం ఈ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ ప్రక్షాళన ద్వారా ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులైన పేదలకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుందని తెలిపారు. కార్డులోని ప్రతీ లబ్ధిదారుని వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు

Related News

Ration cards
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe