భారతదేశం రోడ్లపై ప్రమాదాలను తగ్గించటంతో పాటు వాహనదారుల ప్రాణాలను కాపాడే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలు కొత్త ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి.
జనవరి 2026 నుంచి మార్కెట్లోకి వచ్చే అన్ని ద్విచక్రవాహనాలకు యాంటీ-లాక్బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను తప్పనిసరి చేయడానికి కేంద్రం నిర్ణయించింది. ఇది రోడ్డు భద్రతను మెరుగుపరుస్తుందని రహదారుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది.దీని కింద కొత్తగా మార్కెట్లోకి వచ్చే స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, బైక్స్ ఏబీఎస్ టెక్నాలజీ తో రానున్నాయి. అలాగే కొత్తగా తీసుకొస్తున్న నిబంధనల కింద వాహన విక్రయ సమయంలో కొనుగోలు దారులకు ఎబీఐఎస్ ధృవీకరణ కలిగిన రెండు హెల్మెట్లను అందించటం కూడా తప్పనిసరి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 44శాతం మంది ద్విచక్రవాహన దారులే.
ఎక్కువగా ప్రమాద సమయంలో తలకు అవుతున్న గాయాలే కారణంగా గుర్తించబడింది.
ప్రస్తుతం దేశంలో విడుదల అవుతున్న ద్విచక్ర వాహనాల విషయంలో 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటికి మాత్రమే ఏబీఎస్ టెక్నాలజీ తప్పనిసరిగా ఉంచబడింది. వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో బండి స్కిడ్ కావటం వంటి ప్రమాదాల సమయంలో మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం ఏబీఎస్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇది ప్రమాదాలను తగ్గించటంలో 45 శాతం వరకు దోహదపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలటంతో వీటిని అన్ని వాహనాలకు తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
కొత్తగా తయారయ్యే వాహనాల్లో ఏబీఎస్ టెక్నాలజీ తో వినియోగం ద్విచక్ర వాహనదారులకు రక్షణను పెంచటంతో పాటు వాహన ధరల పెరుగుదలకు దారితీస్తుందని తెలుస్తోంది.ఈ టెక్నాలజీని వాహనాల్లో అమర్చటం అదనపు ఖర్చులకు దారితీస్తుందని వారు చెబుతున్నారు.
అన్ని ద్విచక్ర వాహనాల్లో ABS టెక్నాలజీ.. జనవరి నుంచి తప్పనిసరి. ఎందుకంటే..?

21
Jun