సర్కార్‌పై జంగ్! తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ కార్యాచరణ ప్రకటన

అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్…
లక్ష మందితో భారీ బహిరంగ సభ…
సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు జిల్లాల్లో బస్సు యాత్రలు…
20 నెలలు ఓపికపట్టాం.. ఇక ఆగేదేలేదు…
దాచుకున్న డబ్బులు మాకెందుకివ్వరు…
జీతభత్యాలు ఇచ్చే బాధ్యత సీఎం, డిప్యూటీ సీఎం మీదనే ఉంది…
వైద్యానికి డబ్బులు అందక ప్రాణాలు విడుస్తున్నారు…
ఉద్యోగుల జేఏసీ నేతలు జగదీశ్వర్, శ్రీనివాసరావు..

BB6 TELUGU NEWS CHANNEL
పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జంగ్ సైరన్ మోగించింది. 20 నెలలు ఓపిక పట్టాం.. ఇక ఓపిక పట్టేదిలేదని తెగేసి చెప్పేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 15 వరకు డెడ్ లైన్‌ను విధిస్తూ ప్రభుత్వానికి గతంలోనే విజ్ఞప్తి చేశామని, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించినట్లు జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ రోజు లక్ష మందితో భారీ సభను ఎల్బీ స్టేడియంలో లేదా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపారు. అక్కడి నుంచే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొంది. అవసరమైతే ఆ సభకు తమ కుటుంబ సభ్యులతోనూ హాజరై ప్రభుత్వానికి  నిరసనను తెలియజేస్తామన్నారు. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో జేఏసీ ఉద్యమ కార్యాచరణను మారం జగదీశ్వర్, ఏలూ రి శ్రీనివాసరావు ప్రకటించారు. 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో చర్చించి ఈ కార్యాచరణను ప్రకటిస్తున్న ట్లు వారు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపట్ల ప్రభుత్వ, మంత్రులు, అధికారుల వైఖరి సరిగా లేదన్నారు. కొంత మంది మంత్రులకు తామెవరమో కూడా తెలియదన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినా అధికారులు కావాలనే వాటిని పక్కనబెడుతున్నారని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు మంజూరు, పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ అమలు, హెల్త్ కార్డులు మంజూరు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, 317 జీవో లాంటి 63 సమస్యలను పరిష్కరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ, అధికారుల కమిటీ ముందు మొరపెట్టుకున్నా వాటిని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేది లేకనే తాము ఉద్యమ కార్యాచరణను ప్రకటించామని వారు తెలిపారు. నెలకు రూ. 700 కోట్లు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని చెప్పారని, మూడు నెలలు రూ.2,100 కోట్లను విడుదల చేయాలన్నారు. వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రెం డు సంవత్సరాలైనా పీఆర్‌సీ అమలు చేయలేదన్నారు. బిడ్డ పెళ్లి చేయడానికి, ఇల్లు కట్టుకోవడా నికి దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వడంలేదని వారు పేర్కొన్నారు. తమ జీతభత్యాలు ఇచ్చే బాధ్యత సీఎం, డిప్యూటీ సీఎం మీదనే ఉందన్నారు. ఐఏఎస్ అధికారుల బిల్లులు పెండింగ్‌లో లేనప్పుడు తమవే ఎందుకున్నాయని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు  పీ దామోదర్ రెడ్డి, చావా రవి, వంగా రవీందర్ రెడ్డి, జీ సదానందం గౌడ్, మదుసూధన్ రెడ్డి, కటకం రమేష్, ఏ.సత్యనారాయణ, స్థితప్రజ్ఞ, కస్తూరి వెంకటేశ్వర్లు, బీ శ్యామ్, అంజిరెడ్డి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన సమస్యలు..
– పెండింగ్‌లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి.
– ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తిస్థాయిలో నిబంధనలను రూపొందించి అమలుచేయాలి.
క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి.
-కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
– ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేసేందుకు తక్షణమే ఆదేశాలు జారీచేయాలి.
– 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 57 మెమో ద్వారా పాత పెన్షన్ అమలుచేయాలి.
– పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్ అమలుచేయాలి.

వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి…
గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటా-యించాలి…
స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి…

రాష్ర్ట ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి…
అలాగే మిగితా  పెండింగ్ సమస్యలనింటిని వెంటనే పరిష్కరించాలి.
నూతనంగా ఏర్పడిన మండలాలకు ఎంపీపీ, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలి…
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని మంజూరు చేయాలి…

ఉద్యమ కార్యాచరణ ఇది..

సెప్టెంబర్ 1న సీపీఎస్‌ను రద్దు చేయాలని నిరసిస్తూ పాత పెన్షన్ సాధన సదస్సు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నాంపల్లి లోని తెలుగు లలిత కళాతోరణంలో సాయం త్రం 3 గంటల నుంచి వేలాదిమంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 33 జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 19 వరకు తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్రలను నిర్వహిస్తామన్నారు.

* సెప్టెంబర్ 8న వరంగల్ జిల్లా

* సెప్టెంబర్ 9న కరీంనగర్ జిల్లా

* సెప్టెంబర్ 10న ఆదిలాబాద్ జిల్లా

* సెప్టెంబర్ 11న నిజాంబాద్ జిల్లా

* సెప్టెంబర్ 12న సంగారెడ్డి మెదక్ జిల్లా

* సెప్టెంబర్ 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లా

* సెప్టెంబర్ 16న మహబూబ్‌నగర్ జిల్లా

* సెప్టెంబర్ 17న నల్లగొండ జిల్లా

* సెప్టెంబర్ 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లా

* సెప్టెంబర్ 19 నుండి మిగతా జిల్లాలలో

* అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్ భారీ సభ

💥తాము ఏ పార్టీకి అనుకూలం కాదు..

తమవి న్యాయమైన డిమాండ్లని, ఎందుకు పరిష్కరించరో ప్రభుత్వం స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ర్ట ప్రభుత్వం  అనుసరిస్తున్న తీరు నోటితో పలకరించి, నొసటితో  వెక్కిరించినట్లుగా ఉందని జేఏసీ నేతలు తప్పుపట్టారు. రాష్ర్ట ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఇదిగో తీరుస్తాం, అదిగో తీరుస్తామని కమిటీలు వేస్తూ  కాలం గడపడమే తప్ప సమస్యల పరిష్కారం  చేయలేదని  విమర్శించారు. తాము ఏ రాజకీయ పార్టీకు అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం మాకే దో ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నదన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని 20 నెలలు ఓపికపట్టామని, ఇక ఓపిక నశించిందన్నారు. తమపై క్షేత్ర స్థాయి ఉద్యోగుల తీవ్ర ఒత్తిడి ఉందని, అందుకే కార్యాచరణను ప్రకటించామని స్పష్టం చేశారు. అక్టోబర్ 12న నిర్వహించే సభకు ఉద్యోగులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్యాబినెట్ మీటింగ్, అధికారుల కమిటీ ఇప్పటివరకు ఎన్ని సమస్యలను పరిష్కరించిందో నివేదికను బయటకు పెట్టలేదన్నారు. బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తాత్సారం చేస్తున్నారని విమర్శించారు.ఉద్యోగుల ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీతోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కావాలనే ఆ పథకం అమలుకు మోకాలు అడ్డుపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ, కొందరు వైద్యమందక చనిపోతున్నారని, క్యాన్సర్ రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ఓ ఉద్యోగి కనీసం రూ. 21 వేలు లేక చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe