పనికిరాని ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు – యుఎస్ఎఫ్ఐ
BB6 TELUGU NEWS CHANNEL
ప్రజలకు అత్యంత అవసరమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదని యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం చంద్రకాంత్ ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పనికిరాని ఎన్నో ఉచిత పథకాలను ప్రకటిస్తూ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు, ప్రజల ప్రాణానికి, భవిష్యత్తుకు అవసరమైన విద్య, వైద్యాన్ని మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయకుండా కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయని అన్నారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు లక్షల రూపాయలు ఫీజులు చెల్లించలేక, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం ప్రసాదించిన విద్య, వైద్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ఉచిత విద్య, వైద్యాన్ని పేదలకు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రభుత్వ విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో నిధులు పెంచి, పేద ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని యుఎస్ఎఫ్ఐ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.