ముద్రా రుణాలు ఇప్పిస్తానంటూ రూ. లక్షలు వసూలు చేసిన షేక్ జానీ, స్వాధీనం చేసుకున్న వాహనాలు
BB6 TELUGU NEWS 5 Aug 2025 : హైదరాబాద్: నగరంలో 2 ఇళ్లు.. ఖరీదైన కారు.. సరదాగా తిరిగేందుకు రాయల్7 ఎన్ఫీల్డ్.ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు.. ఒంటికి చెమటపట్టకుండా ఇతరులను మోసం చేస్తూ పెద్దఎత్తున సొమ్ము కొల్లగొట్టిన మోసగాడి కథ ఇది.ముద్ర రుణాలు ఇప్పిస్తానంటూ సుమారు 500 మంది మహిళలను మోసం చేసిన షేక్ జానీ అలియాస్హరినాథ్ రావు (34)ను మధ్య మండలం టాస్క్ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర సోమవారం వెల్లడించారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన షేక్ జానీ ఇంటర్ తప్పుడు. ఉపాధి కోసం 2011లో హైదరాబాద్ చేరాడు.సరూర్నగర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు.కొంతకాలం ప్రైవేటు సంస్థల్లో పనిచేశాడు. కొవిడ్ సమయంలో ఉద్యోగం పోవటంతో యూట్యూబ్ వీడియో ద్వారా ముద్ర రుణాల గురించి అవగాహన పెంచుకున్నాడు. విశ్రాంత సైనిక ఉద్యోగికి బ్యాంకు రుణం ఇప్పిస్తానంటూ గుర్తింపు కార్డులు తీసుకున్నాడు.అదే పేరుతో సిమ్ కొనుగోలు చేశాడు. ఉదయాన్నే .బైక్ పై పలు ప్రాంతాలు తిరిగేవాడు. టైలరింగ్,బ్యూటీపార్లర్ వ్యాపారాలను గమనించేవాడు. దుకాణాల బోర్డులపై ఉండే ఫోన్ నంబర్లతో వారికి ఫోన్ చేసి,ముద్ర రుణాల ఏజెంట్ హరనాథ్ రావుగా పరిచయం చేసుకునేవాడు.
రూ. లక్షకు రూ.2 వేలు కమీషన్ ఇవ్వాలని షరతు విధించేవాడు. ఏటీఎం వద్దకు వెళ్లి, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారని, బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు వస్తుందని చెప్పి.. వారి ఖాతాల్లో కమీషన్ సొమ్ము జమ చేయించేవాడు. ఇలా మాయమాటలతో ప్రతినెలా రూ. 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ సొమ్ముతో నగర శివార్లలో రెండు ఫ్లాట్లు, కారు, ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో షేక్ జానీని అదుపులోకి తీసుకొని కారు,ద్విచక్రవాహనం, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.