మహబూబ్‌నగర్, జూలై 14 (BB6TELUGUNEWSCHANNEL): స్థానిక సంస్థల ఎన్నికల్లో (Telangana Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్‌ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలుస్తుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇప్పటికే ఎన్నికలను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆలోపే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతానికి పంచాయతీలకంటే ముందు పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓటర్ జాబితా సిద్ధం కాగా.. కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, ప్రింటింగ్ కూడా అధికారులు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపైనే

15
Jul