గ్రేటర్ పరిధిలో స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాసంస్థలు తెరిచే ముందే తమ వాహనాలను ఫిట్నెస్ టెస్టుకు తీసుకురావాల్సిందిగా నోటీసులు జారీచేస్తే, 50 శాతం మాత్రమే ఫిట్ నెస్ టెస్టులు చేయించుకుని సర్టిఫికెట్లు పొందారని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 1300 వాహనాలు ఉంటే 775,రంగారెడ్డిలో 6200 వాహనాలకు 4500,మేడ్చల్ పరిధిలో 6100 వెహికల్స్కు 3200 మంది సర్టిఫికెట్లు పొందారని చెప్తున్నారు.
సగం వాహనాలకే ఫిట్ నెస్ సర్టిఫికెట్లు తీసుకోవడంతో వారం రోజులుగా స్కూల్ బస్సులపై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని వందల బస్సులపై కేసులు నమోదు చేశామని,కొన్ని వాహనాలను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్లో తిరుగుతున్న స్కూల్ బస్సుల్లో 15 ఏండ్లు పూర్తయినవి కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. అయితే, కొందరు ఆఫీసర్లు స్కూల్ యాజమాన్యాల నుంచి ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, అందుకే అనేక విద్యాసంస్థలు ఫిటెనెస్ లేకపోయినా ధీమాగా బస్సులను రోడ్లపై తిప్పుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యాసంస్థల వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే కొన్ని ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలి. వాహనాల్లో స్టూడెంట్స్ సులభంగా ఎక్కి దిగడానికి మెట్ల అమరిక ఉండాలి. కిటికీల నుంచి చేతులు, తల బయట పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. వెహికల్స్ కు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించాలి . ఆర్టీఏకు పన్ను చెల్లించిఉండాలి. బస్సు నడిపే డ్రైవర్ 60 ఏళ్లలోపు వారై ఉండాలి. 15 ఏండ్లు దాటిన వాహనాలు రోడ్లపై తిప్పకూడదు. అయితే,ఇందులో చాలా నిబంధనలు పాటించడం లేదు కాబట్టే విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్నెస్ టెస్టుకు రావడం లేదని తెలుస్తోంది. యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నామని, రూల్స్ పాటించకపోతే సీజ్ చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.
349 కేసుల నమోదు
గ్రేటర్ పరిధిలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులని గుర్తించేంత వరకు స్పెషల్ డ్రైవ్ కోనసాగుతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో మంగళవారం నాటికి 160 కేసులు నమోదు చేయగా బుధవారం, గురువారం కలిపి మరో 189 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈరెండు రోజుల్లో 1,223 వాహనాలను తనిఖీ చేశామన్నారు. ఇందులో 66 వాహనాల పత్రాలు సరిగ్గా లేవని, 199వాహనాలపై రిఫ్లెక్టివ్టేప్స్ లేవని గుర్తించినట్టు చెప్పారు. వీరి నుంచి కాంపౌండింగ్ ఫీజుల కింద రూ1.26 లక్షలు వసూలు చేసినట్టు అధికారులు
తెలిపారు.
స్పెషల్ డ్రైవ్ లో నిర్వహిస్తున్న ఆర్టిఏ _ బడి బస్సులు భద్రమేనా ?

21
Jun