ముష్టిపల్లి గ్రామంలో ఓ తల్లి తన సొంత కుమారుడిపై క్షుద్రపూజలు చేయించిన ఘటన కలకలం రేపింది. తన తల్లి బాలమ్మతో పాటు తమ్ముడు, చెల్లెలు కలిసి పగతో తనపై క్షుద్రపూజలు చేశారని కుమారుడు కురుమూర్తి ఆరోపణలు చేశాడు. బొమ్మ, ఫోటో, మంత్రాలు రాసిన నోట్‌బుక్ లాంటి ఆధారాలు లభ్యమయ్యాయి. కుటుంబ తగాదాలే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక తల్లి తన సొంత కుమారుడిపై క్షుద్రపూజలు చేయించిందని ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఉదంతం స్థానికుల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కురుమూర్తి అనే వ్యక్తి తన తల్లి బాలమ్మ, తమ్ముడు శ్రీశైలం, చెల్లెలు చెన్నమ్మలు.. తనపై పగతో క్షుద్రపూజలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలమ్మ ఓ బొమ్మను తయారు చేసి.. దానికి తన కుమారుడి ఫోటోను దారంతో కట్టి.. ప్రత్యేక మంత్రాలతో క్షుద్రపూజలు నిర్వహించిందని ఆరోపణ. మంత్రాలన్నీ ఒక నోట్‌బుక్‌లో రాసి ఉండడం.. అది కురుమూర్తి దొరకడం ఈ ఆరోపణల్ని మరింత బలపరిచింది.
కురుమూర్తి తన ఫిర్యాదులో కుటుంబంలో జరిగిన తగాదాలు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. వివాహం అనంతరం కుటుంబసభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు చెలరేగాయని.. వాటి వల్లే తన తల్లితో సహా కుటుంబసభ్యులు తనపై పగ పట్టారని చెప్పారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కురుమూర్తి.. అవన్నీ క్షుద్రపూజల వల్లనే జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. పాతకాలపు నమ్మకాలతో క్షుద్రపూజలు నిర్వహించడం ఇప్పటికీ కొనసాగుతోందన్న వార్త స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వ్యవహారంపై పూర్తిగా దర్యాప్తు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామస్థుల మధ్య అవగాహన పెంచడం అవసరం.
ఎంత కోపం ఉన్నా – కడుపున పుట్టిన కొడుకుపై ఏ తల్లి అయినా ఇంత పని చేస్తుందా..?

19
Jun