సర్పంచ్ బరిలో 62%, వార్డు సభ్యుల్లో 78% యువతే మొదటి, రెండో విడత నామినేషన్లలో ఇదే ట్రెండ్
BB6 TELUGU NEWS CHANNEL
ఒకప్పుడు పల్లెరాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామరాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో సింహభాగం యువతదే కావడం విశేషం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వచ్చిన తాజా గణాంకాల ప్రకారం.. రెండు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్లు వేసిన వారిలో 30 నుంచి 44ఏండ్ల మధ్య వయసున్న వారే దాదాపు 73
శాతం వెల్లడయింది.ఇది ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు,గ్రామాల్లో నాయకత్వ మార్పునకు,అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ఇస్తున్న బలమైన సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల సరళిని పరిశీలిస్తే సర్పంచ్ రేసులో నిలిచిన వారిలో 62శాతం మంది యువతే ఉండగా, వార్డు సభ్యుల స్థానాలకు ఏకంగా 78 శాతంమంది యువతీయువకులు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యావంతులు, ఉన్నత చదువులు చదివిన వారు కూడా పంచాయతీ ఎన్నికలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే కాకుండా, సామాన్య కుటుంబాలకు చెందిన యువత కూడా నామినేషన్లు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి,రెండో విడత నామినేషన్ల డేటా ఈ కొత్తట్రెండ్ కు అద్దం పడుతోంది. కాగా, ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లో 4,236 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లలో 85 వేలమంది అభ్యర్థులు 30 నుంచి 44 ఏండ్లలోపు వాళ్లే ఉన్నారు. అంటే మొత్తం నామినేషన్లలో 79 శాతం ఉన్నారు. అలాగే సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లోని 4,333 గ్రామాల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు వచ్చిన నామినేషన్లలోనూ అత్యధికంగా 40 ఏండ్లలోపువాళ్లే ఉన్నారు. ఇందులోనూ సర్పంచ్, వార్డు సభ్యులకు లక్ష వరకు నామినేషన్లు రాగా, 76 శాయువతవే ఉన్నాయి.
పెరిగిన రాజకీయ చైతన్యం గ్రామాల్లో పెరిగిన రాజకీయ చైతన్యం,సోషల్ మీడియా యువతను ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి, ఎంబీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు కూడా సర్పంచ్ బరిలో నిలిచారు. గతంలో వార్డు సభ్యుల ఎన్నికలను పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతి వార్డులోనూ యువత పోటీకి దిగుతుండటంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివినవారు, ఐటీ ఉద్యోగులు సైతం సెలవులపై వచ్చి మరీ నామినేషన్లు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఓమారుమూల గ్రామంలో ఎంబీఏ చదివిన యువకుడు, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిసర్పంచ్ గా నామినేషన్ వేశాడు.

పల్లెలో ఉంటూనే ఆన్లైన్ ద్వారా ప్రపంచంతో పోటీ పడవచ్చు, మన ఊరిని ప్రపంచంతో పోటీ పడవచ్చు, మన ఊరిని స్మార్ట్ విలేజ్ మార్చవచ్చు” అని ఆయువకుడు చెబుతున్న మాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. అలాగే, వరంగల్ జిల్లాలో బీటెక్ విద్యార్థిని ఒకరు వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. ఇలా రెండు విడతల్లో దాదాపు 9 వేలగ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద ఎత్తున యువత నామినేషన్లు వేశారు. గత రెండు, మూడు దశాబ్దాల పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో యువత నామినేషన్లు దాఖలు చేయడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెప్తున్నారు. ఏకగ్రీవాలకు చెక్ పెట్టేలా పోటీరాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4,23 6 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్ గిరీ కోసం ఏకంగా 22,330 మంది బరిలో నిలిచారు. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే 37,440 స్థానాలకు గాను ఏకంగా 85,428 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సగటున ఒక్కో సర్పంచ్ పదవికి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రధాన గ్రామాల్లో ఈ సంఖ్య పదికి పైగానే ఉండటం విశేషం.
వార్డు సభ్యుల స్థానాలకు కూడా గతంలో ఏకగ్రీవాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి ఆ పదవులకు కూడా యువత పోటీకి సై అంటుండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంగళవారంతో ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియలోనూ అదే జోరు కనిపించింది.రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 4,332 గ్రామ పంచాయతీలకు గాను, కేవలం,రెండు రోజుల్లోనే 12,479 మంది సర్పంచ్ పదవుల కోసం నామినేషన్లు వేశారు. ఇక వార్డు సభ్యుల స్థానాలకు 30,040 నామినేషన్లు వచ్చాయి. రెండో విడతలో మొత్తం సర్పంచ్ నామినేషన్లు 20 వేల మార్కును దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి మొదలు కానుంది.