జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌తో ముఖాముఖి చ‌ర్చ..

BB6 TELUGU NEWS CHANNEL
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌తో ముఖాముఖి చ‌ర్చ కార్య‌క్ర‌మం తేది 2-11-2025 నాడు బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ నిర్వ‌హించింది.
శ్రీ దాసోజు శ్రవ‌ణ్‌కుమార్ బి.ఆర్‌.ఎస్‌. త‌ర‌పున‌, శ్రీ ఎస్‌. ప్ర‌కాశ్‌రెడ్డి బి.జె.పి. త‌ర‌పున కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
ప్ర‌తి అభ్య‌ర్థికి 20 నిమిషాల స‌మ‌యం కేటాయించ‌గా వారు త‌మ త‌మ పార్టీ సిద్ధాంతాల‌ను వివ‌రిస్తూ ఒక వేళ ఎన్నికైన జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పినారు.  అటు త‌రువాత ప్ర‌శ్న‌లు – జ‌వాబులు కార్య‌క్ర‌మ‌ము చేప‌ట్ట‌బ‌డింది.
బ‌రిలో ఉన్న ముగ్గురు అభ్య‌ర్థుల‌కు నేర‌చ‌రిత్ర ఉంది.  బి.జె.పి. అభ్య‌ర్థిపై 5 కేసులు, బి.ఆర్‌.ఎస్‌. అభ్య‌ర్థిపై 1 కేసు, కాంగ్రెస్ అభ్య‌ర్థిపై 7 కేసులు ఉన్నాయి.  రాజ‌కీయ‌పార్టీలు గెలుపు గుర్రాల‌ను దృష్టిలో ఉంచుకొని టికెట్లు ఇవ్వ‌డం జ‌రిగింది.  కాని క్లీన్ రికార్డు ఉన్న‌వారికి టికెట్లు ఇచ్చిన బాగుండేద‌ని ఓట‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు.  త‌మ స‌మ‌స్య‌లు ముఖ్యంగా ర‌హ‌మ‌త్ న‌గ‌ర్‌లో ఇరుకురోడ్లు, రోడ్ల ఆక్ర‌మ‌ణ‌, పొంగిపొర్లుతున్న డ్రైనేజి వంటివి తెలిపినారు. 
అలాగే షేక్‌పేట్ లో ద‌శాబ్ధ కాలంగా వారికి బ‌స్సు సౌక‌ర్యం లేక ఇబ్బందిప‌డుతున్నార‌ని గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా ఈ స‌మ‌స్య చెప్పుకున్నా ఎన్నిక‌ల‌ప్పుడు హామీ ఇవ్వ‌డం, అటు త‌రువాత మ‌ర్చిపోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపినారు. 
అలాగే యూస‌ఫ్‌గూడ లోని ఇందిరాన‌గ‌ర్ కాల‌నీలో న‌ల్లా క‌నెక్ష‌న్ కావాల‌ని చాలా సంవ‌త్స‌రాల నుంచి అడుగ‌గా ఇంత‌వ‌ర‌కు ప‌నులు జ‌రుగ‌లేద‌ని అలాగే కొద్దిపాటి వ‌ర్షానికే లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మై ఇళ్ళ లోనికి నీరు రావ‌డం  దానికి తోడు పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గురించి అడ‌గ‌డం జ‌రిగింది.  ఈ స‌మ‌స్య‌లు ఎన్నికైన త‌రువాత త‌ప్ప‌క ప‌రిష్క‌రిస్తామ‌ని అభ్య‌ర్థుల త‌ర‌పున వ‌చ్చిన వారు తెలుప‌డం జ‌రిగింది. మూడు సార్లు ఎం.ఎల్‌.ఏ. గా గెలిపించినా స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయి.  మ‌రి ఇప్పుడు గెలిపిస్తే ఏమి చేస్తార‌ని బి.ఆర్‌.ఎస్‌. వారిని అడగ‌డం జ‌రిగింది.  రాజ‌కీయ‌పార్టీల ఓట్లు కొంటున్నార‌ని అలాగే కులం, మ‌తం, ప్రాంతం పేరు మీద ఓట్లు అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించ‌గా అటువంటిది ఏది లేద‌ని తెలిపినారు.
ఇరుకు మ‌రియు గుంత‌ల‌రోడ్లు, ఫుట్‌పాత్ లు మ‌రియు రోడ్ల ఆక్ర‌మ‌ణ‌లు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీ స‌మ‌స్య‌లు గ‌త ద‌శాబ్ధ‌కాలంగా ఉన్న ఏ పార్టీ కూడ ప‌ట్టించుకోవ‌డం లేదు.  ఉప ఎన్నిక పుణ్యాన ఎల‌క్ష‌న్ నోటిఫికేష‌న్‌కు రెండు వారాల ముందు ఆద‌రా బాద‌రాగా రెండు వంద‌ల కోట్లు మంజూరు చేసి ప‌నులు మొద‌లుపెట్టినారు.  ఎన్నిక‌లు దృష్ట‌లో ఉంచుకొని ప‌నులు మంజూరు చేయ‌డాన్ని ఓట‌ర్లు త‌ప్పు ప‌ట్టినారు.
ఈ కార్య‌క్ర‌మానికి ఫోరం అధ్య‌క్షులు యం. ప‌ద్మ‌నాభ‌రెడ్డి, సోమ శ్రీ‌నివాస రెడ్డి కార్య‌ద‌ర్శి మోడ‌రేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి కార్య‌క్ర‌మాన్ని న‌డిపించినారు.  కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఓట‌ర్లు ఇది ఒక వినూత్న కార్య‌క్ర‌మ‌మ‌ని ముందు ముందు సాధార‌ణ ఎన్నిక‌ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఇటువంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కోరినారు.
యం. ప‌ద్మ‌నాభ‌రెడ్డి , అధ్య‌క్షులు , ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe