గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి అనుమ‌తులు మంజూరు చేయాల‌ని సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ కి విజ్ఞ‌ప్తి..

BB6 TELUGU NEWS CHANNEL
భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ కి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కూడా తెలంగాణ‌ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల మ‌ధ్య గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మించాల్సి ఉంద‌ని గుర్తు చేశారు.

తెలంగాణ‌కు స‌ముద్ర రేవు లేనందున, బంద‌రు పోర్ట్ వ‌ర‌కు స‌ర‌కు ర‌వాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారి మంజూరు చేయాల‌ని కోరారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిలో 118 కిలోమీటర్లు తెలంగాణ‌లో మిగ‌తా భాగం ఏపీలో ఉంటుంద‌ని ముఖ్యమంత్రి గారు వివ‌రించారు.

➡️ పలువురు ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ గారితో వారి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో ప‌లు జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం, అనుమ‌తులు, ప‌నుల వేగ‌వంతంపై చ‌ర్చించారు. 

హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగు రోడ్డుకు (నార్త్‌) 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్తయినందున వెంట‌నే ఫైనాన్షియ‌ల్‌, క్యాబినెట్ అనుమ‌తులు ఇచ్చి ప‌నులు ప్రారంభించాల‌ని ముఖ్యమంత్రి గారు కోరారు. ఆర్ఆర్ఆర్ (నార్త్‌)కు స‌మాంత‌రంగా ఆర్ఆర్ఆర్ (సౌత్‌) ప‌నులు చేప‌ట్టాల‌ని, అందుకు వెంట‌నే అన్ని అనుమ‌తులు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

➡️ హైద‌రాబాద్‌ను ప్ర‌సిద్ధ శైవ క్షేత్రం శ్రీ‌శైలంతో అనుసంధానించే మ‌న్న‌నూర్‌ – శ్రీ‌శైలం ర‌హ‌దారి అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వు ప‌రిధిలో ఉన్నందున 4 వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమ‌తులు మంజూరు చేయాల‌న్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్త‌యితే ఏపీలోని కృష్ణ‌ప‌ట్నం రేవుతో పాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరుల‌కు రాక‌పోక‌లు సులుభమవుతాయని చెప్పారు. రావిర్యాల‌ – ఆమ‌న్‌గ‌ల్‌ – మ‌న్న‌నూర్ 4 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి గారు కోరారు.

➡️ హైద‌రాబాద్‌ – మంచిర్యాల మ‌ధ్య ఉన్న రాజీవ్ ర‌హ‌దారిపై వాహ‌న ర‌ద్దీ అధికంగా ఉన్నందున హైద‌రాబాద్‌ -మంచిర్యాల మధ్య నూత‌న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. సీఆర్ఐఎఫ్ కింద రూ.868 కోట్ల‌తో పంపిన ర‌హ‌దారుల ప‌నులను మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి గారిని కోరారు.

➡️ ముఖ్య‌మంత్రి  చేసిన విజ్ఞ‌ప్తుల‌కు నితిన్ గ‌డ్క‌రీ  సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ ప‌నుల‌కు వారంలోపు అనుమ‌తులు ఇస్తామ‌ని తెలిపారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ – అమ‌రావ‌తి – బంద‌రు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారికి సంబంధించి త‌మ శాఖ అధికారుల‌ను హైద‌రాబాద్‌కు పంపుతాన‌ని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎన్‌హెచ్‌, ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌తో ఈ నెల 22వ తేదీన  హైద‌రాబాద్‌లో స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని ముఖ్యమంత్రి  వివరించారు.

➡️ కేంద్ర మంత్రి గారితో జరిగిన స‌మావేశంలో ఎంపీలు రేణుకా చౌద‌రి , డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి , పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌ , రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి , చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related News

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe