BB6 TELUGU NEWS CHANNEL :
అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయం వరకు సభలో మాట్లాడే అవకాశాన్ని బీజేపీ పార్టీ ఇచ్చేది కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. కానీ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే వివిధ అంశాలు లేవనెత్తుతానన్నారు. తనలాగే బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 29: అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు. ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయం వరకు సభలో మాట్లాడే అవకాశాన్ని పార్టీ ఇచ్చేది కాదని పేర్కొన్నారు. కానీ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే వివిధ అంశాలు లేవనెత్తుతానన్నారు. తనలాగే బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహారమేనని తెలిపారు. వారిలాగే చాలా మంది పదవులు పోతాయని పార్టీలో జరుగుతున్న ఇబ్బందులపై నోరు విప్పడం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా.. వాటిని కొంతమంది సర్వనాశనం చేశారంటూ బీజేపీలోని పలువురు నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పటివరకూ ఢిల్లీలోని బీజేపీ నేతల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఒకవేళ వస్తే ఇక్కడ నెలకున్న ఇబ్బందులను వారికి వివరించిన తర్వాతే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తానని స్పష్టం చేశారు. లేకుంటే చచ్చినా.. మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లనని ఆయన కరాకండిగా చెప్పారు. ఇక పార్టీలోని పలువురు ఎంపీలు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను సైతం గెలిపించలేకపోయారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, బీసీ బిల్లులపై అసెంబ్లీ సమావేశాలు అనేది కేవలం ప్రజల నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని దమ్ముంటే సీబీఐకి అప్పచాలంటూ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి అంటే.. ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
ఇక బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేసే సమయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీలోని పలువురు నేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కూడా ఆయన పరోక్షంగా చేశారు. అయితే రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకత్వం వెంటనే ఆమోదించిన విషయం విదితమే.