Dog Bites: గంటకు 14 మందిని కరుస్తున్నాయ్!రేబిస్తో 13 మంది మృతి ,రెండు ఉండాల్సిన చోట 20 కుక్కలు

BB6 TELUGU NEWS CHANNEL:
రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కకాటు బాధితులు
రేబిస్తో 13 మంది మృతి ..రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారమెప్పుడన్న ప్రశ్న ఉదయిస్తోంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషను చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం.సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి.. తీవ్రసమస్యగా మారింది. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్కకాటుకు గురయ్యారు. మొత్తం13 మంది రేబిస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్నప్పుడో.. వీధిలో ఆడుకుంటున్నప్పుడో ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాట్లకు గురి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024 లో 1,21,997 మందిని.. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 87,366 మందిని కుక్కలు కరిచాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్కకాటు బారినపడ్డారు. ఢిల్లీలోనూ ఈ ఏడాది ప్రథమార్థంలో 35,198 మంది కుక్కకాటుకు గురయ్యారు. డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో 36% భారత్లోనివే.బాధితుల్లో 15 ఏళ్ల లోపు వారే అధికం. ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈసమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈనేపథ్యంలో శునకాలపై కరుణ చూపాలంటూ జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఇంకో వైపు కుక్కకాటు బాధితులు, వారి మద్దతుదారులు పోటాపోటీగా శునక ప్రేమికుల వాదనలకు ప్రతివాదాలు చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు2023లో నమోదైన కుక్కకాటు కేసులను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఈమేరకు రాష్ట్రంలోని పరిస్థితి, హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలు, దేశంలోని చట్టాలగురించి జీహెచ్ఎంసీ కోర్టుకు అనేక విషయాలతో ప్రమాణపత్రం సమర్పించింది. మన దేశంలో..జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం-1960 ప్రకారం హానిచేసే కుక్కలకు ప్రశాంత మరణాన్ని ఇవ్వాలి.జీహెచ్ఎంసీ చట్టం అదే చెబుతున్నట్లు బల్దియా కోర్టుకు తెలిపింది.

ఆ దేశాల్లో రోడ్లపై తిరగనివ్వరు..
యూకే, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధిలో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరూ తీసుకెళ్లకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యజమానులు నిబంధనలను పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్కు వాటిని రోడ్లపైకి తీసుకెళ్లకూడదు. ఏదైనా కారణంతో వాటిని పోషించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలి. వీధుల్లో వదలకూడదు.

రెండు ఉండాల్సిన చోట 20 కుక్కలు- డాక్టర్ కర్నాటి శ్రీనివాసులు, యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు

తెలంగాణలో 20 లక్షల కుక్కలు ఉండొచ్చని అంచనా. రెండు ఉండాల్సిన వీధిలో 20 వరకు శునకాలుంటున్నాయి. సమస్యను కట్టడి చేయాలంటే..ఏడాదిలోనే కుక్కలన్నింటికీ సంతాన నిరోధక (ఏబీసీ-యానిమల్ బర్త్ కంట్రోల్) ఆపరేషన్లు చేయాలి.ప్రభుత్వాల వద్దనున్న మౌలిక సౌకర్యాల సమస్యతో ఈపద్ధతి అమలు కావడంలేదు. సీఎన్వీఆర్ (క్యాచ్-న్యూటర్-వ్యాక్సినేట్-రిలీజ్) విధానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్’ అనుమతి ఇవ్వట్లేదు. ఆయా అంశాలపై విస్తృత చర్చ జరగాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe