ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిద్దరికీ ఉరిశిక్ష విధించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

BB6 TELUGU NEWS  8 Aug 2025 :
Bandi Sanjay: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా జడ్జిలు, అధికారులు ఇలా చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలకు తెరలేపారు. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన బండి సంజయ్.. బయటికి వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా కుదిపేస్తోంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తీవ్ర ఆరోపణలు రాగా.. ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇక సాక్షులు, వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్రమంత్రి బండి సంజయ్‌.. దిల్ ఖుష్ భవన్‌లో సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను బండి సంజయ్.. సిట్ అధికారులకు అందించారు.
దాదాపు రెండున్నర గంటల పాటు.. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించినట్లు బయటికి వచ్చిన తర్వాత వెల్లడించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని.. అందుకు వారికి ఉరిశిక్ష విధించాలని బండి సంజయ్ సంచలన డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందితులకు కాపాడే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కేసును ఇంకా సాగిదీస్తున్నారని అన్నారు. కమిషన్లు, కమిటీలు వేసి.. నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకుండా సైలెంట్ అయిపోతారని బండి సంజయ్ మండిపడ్డారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe