LPG Price: ఒకటో తేదీ గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. కొత్త రేట్లు ఇవే

LPG Gas Price Cut: ప్రతి నెలా తొలి రోజున చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ రేట్లు సవరిస్తాయి. ఇప్పుడు ఈ జులై 1వ తేదీన సైతం వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందించాయి. అయితే గృహ వినియోగ ఎల్‌పీజీ రేట్లు మారలేదు. వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి తగ్గించాయి. 2025, జులై 1 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. 19 కిలోల సిలిండర్ ధర రూ. 58 మేర తగ్గింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

LPG Gas Price Cut: జులై నెలలోకి వచ్చేశాం. అయితే, సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో ఆర్థిక అంశాలకు చెందిన చాలా మార్పులు అమలులోకి వస్తుంటాయి. ఇందులో కొన్ని అదనపు భారాన్ని కలిగిస్తే, కొన్ని నిర్ణయాలు ఊరట ఇస్తాయి. ప్రతి నెలా మొదటి రోజున ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు వంట గ్యాస్ సిలిండర్ల ధరలను మారుస్తుంటాయి. ఇప్పుడు ఈ జులై 1వ తేదీన సైతం ఎల్‌పీజీ ధరలను సవరించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా మూడో నెలలోనూ తగ్గించి శుభవార్త అందించాయి. గత నెలలో ఒక్కో సిలిండర్ పై రూ. 24 మేర తగ్గించగా ఇప్పుడు మరో రూ. 58 వరకు తగ్గించి ఊరట కల్పించాయి. సవరించిన కొత్త రేట్లను జులై 1, 2025 నుంచే అమలులోకి తీసుకొచ్చాయి.
19 కిలోలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 58.50 మేర తగ్గించాయి చమురు సంస్థలు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమెర్షియల్ సిలిండర్ (19 కిలోలు) ధర రూ. 1665కు దిగివచ్చింది. ఈ నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటళ్లు, చిరు వ్యాపారులకు మేలు చేకూర్చనుంది. సిలిండర్ ధరలు తగ్గడంతో పెట్టుబడి భారం నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. సిలిండర్ ధరలను ప్రముఖ న్యూస్ ఏజెన్సి ఏఎన్ఐ ధ్రువీకరించింది. 19 కిలోల సిలిండర్ ధర ఒక్కోదానిపై రూ. 58.50 చొప్పున తగ్గించినట్లు తెలిపింది. కొత్త రేట్లు జులై 1 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలిపింది. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని పేర్కొంది.
మరోవైపు.. వాణిజ్య సిలిండర్ ధరలు గత మూడు నెలలుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో ఒక్కో సిలిండర్ పై రూ. 41 మేర తగ్గించిన కేంద్రం, మే నెలలో రూ. 14.50 చొప్పున తగ్గించింది. ఆ తర్వాత జూన్ నెలలో రూ. 24 మేర తగ్గించగా ఇప్పుడు ఏకంగా రూ. 58.50 మేర తగ్గించడం గమనార్హం. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ. 843, ముంబైలో రూ. 852.50, కోల్‌కతాలో రూ. 879, చెన్నైలో రూ. 868, బెంగళూరులో రూ. 805.50, హైదరాబాద్‌లో రూ. 905గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఓవైపు పెరుగుతున్న క్రమంలో సిలిండర్ ధరలను తగ్గించి ఊరట కల్పించడం గమనార్హం. కొన్నిసార్లు 15వ తేదీలోనూ సిలిండర్ ధరలను చమురు సంస్థలు సమీక్షిస్తుంటాయి. సిలిండర్ ధరలను పెంచడం లేదా తగ్గించడం లేదా యథాతథంగా కొనసాగించడం చేస్తుంటాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe