కొన్ని కొన్ని సంఘటనలు వింటే.. చాలా వింతగా, జోక్‌గా అనిపిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని దేశవ్యాప్తంగా కోట్ల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎంత కష్టమైనా సరే.. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా.. రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యాడు. ట్రైనింగ్‌లో తనను తెల్లవారుజామున 4 గంటలకే లేపుతున్నారని.. తనకు 8 గంటలకు లేచే అలవాటు ఉందని పేర్కొంటూ.. నాకు పోలీస్ జాబ్ వద్దంటూ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాడు. ఇంతకీ చివరికి ఏం జరిగిందంటే?
పోలీసు జీవితం అంటేనే కఠినమైన క్రమశిక్షణ, నిరంతర శిక్షణ ఉంటుంది. ఇక పోలీస్ ట్రైనింగ్‌లో అయితే.. వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నింటినీ తట్టుకుని.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే ఉద్యోగం కల్పిస్తారు. అయితే తాజాగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్‌లో తెల్లవారుజామున నిద్ర లేపుతున్నారనే కారణంతో ఓ కానిస్టేబుల్.. తనకు ఉద్యోగం వద్దంటూ ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లాడు. తాను రోజూ 8 గంటలకు నిద్ర లేస్తానని.. కానీ ఉదయం 4 గంటలకే నిద్ర లేపుతుండటంతో తనకు నిద్ర సరిపోవట్లేదని పేర్కొన్నాడు. అందుకే తనకు కానిస్టేబుల్ ఉద్యోగం వద్దని.. ఎస్పీని కలిసేందుకు ఆఫీస్‌కు వెళ్లగా.. అక్కడ ఉన్న అధికారి ఒకరు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చాడు. కేవలం ట్రైనింగ్‌లోనే ఇబ్బంది ఉంటుందని.. ఆ తర్వాత అంతా సవ్యంగానే ఉంటుందని నచ్చజెప్పడంతో.. ఆ కానిస్టేబుల్ తిరిగి ట్రైనింగ్‌కు వెళ్లిపోయాడు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా కానిస్టేబుల్ నియామక పత్రాన్ని అందుకున్న కొద్ది రోజులకే ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే పోలీస్ ట్రైనింగ్ ప్రారంభమైన ఐదో రోజునే.. ఆ కానిస్టేబుల్ తన తండ్రితో కలిసి డియోరియాలోని పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎస్పీ విక్రాంత్ వీర్‌ను కలవాలని అక్కడి సిబ్బందిని కోరాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న కానిస్టేబుల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ మహేంద్ర కుమార్‌తో.. ఆ కానిస్టేబుల్, అతని తండ్రి మాట్లాడి విషయం మొత్తం చెప్పారు. తాను ఉదయం 4 గంటలకు నిద్ర లేవడానికి అలవాటు పడలేదని.. ఇంతకుముందు ఉదయం 8 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉందని చెప్పాడు. అంతేకాకుండా కానిస్టేబుల్ ట్రైనింగ్‌లో భాగంగా రోజువారీ కఠినమైన శిక్షణ తాను తట్టుకోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక ఆ కానిస్టేబుల్ తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడు బీఈడీ చదివాడని.. టీచర్ కావాలని కోరుకుంటున్నాడని.. అదే సమయంలో రోజంతా చదువుకోవడానికి అలవాటు పడినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పోలీస్ ట్రైనింగ్‌లో శారీరక కఠినత్వం తన కుమారుడికి అంతగా నచ్చలేదని పేర్కొన్నాడు. అయితే డాక్టర్ మహేంద్ర.. ఆ కానిస్టేబుల్‌కు, అతడి తండ్రికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో.. వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. పోలీస్ ట్రైనింగ్‌లో ఇలాంటి సమస్యలు సహజమని.. అయితే క్రమంగా పరిస్థితులు అలవాటు పడతాయని వారికి నచ్చజెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాత.. ఆ కానిస్టేబుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంతేకాకుండా ఎస్పీని కలవకుండానే అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం.
కానిస్టేబుల్ వింత వాదన.నాకొద్దు పోలీసు జాబ్.. ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేవను.

28
Jun