BB6 TELUGU NEWS గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు.ఆయన కథనం మేరకు.. కేటీదొడ్డి మండలం కోతులగిద్దకు చెందిన అనిత (26)కు పాతపాలెం గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులుతో కొంతకాలం కిందట వివాహమైంది. కాగా అనిత అదే గ్రామానికి చెందిన మాల దలాయి రంగస్వామితో వివాహేతర సంబంధం కొనసాగించేది.
ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో పలుమార్లు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త ఈ నెల 15న హైదరాబాద్ లో కూలీ పనులకు వెళ్లగా.. అదే రోజు రాత్రి రంగస్వామి ఇంటికొచ్చాడు. అయితే ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యంమత్తులో ఉన్న రంగస్వామి.. ఆమె గొంతుకు చీర బిగించి హత్యచేశాడు. ఈ ఘటనపై అనిత తమ్ముడు అశోక్ ఫిర్యాదు మేరకు కేటీదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.రంగస్వామి అనితతో తరచూ ఫోన్లో మాట్లాడటాన్ని గుర్తించి శనివారం తెల్లవారుజామున సంగాల పార్కు సమీపంలో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరం అంగీకరించారని.. ఐదురోజుల్లో కేసు ఛేదించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. రంగస్వామిని గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు

22
Jun